సమయం: ఉదయం 9 గంటలు (కొన్నేళ్ళ క్రితం)
సందర్భం: సూర్య గ్రహణం
“తలుపులన్నీ వేసేయండి. కర్టెన్ లన్నీ మూసెయ్యండి.” ఆజ్ఞాపించారు మా మామగారు. “వంటలన్నీఆపేయండి. టిఫిన్ లు ఏమి చెయ్యేదు. మంచి నీరు కూడా వద్దు. సూర్య గ్రహణం అయిపోయిన తర్వాత స్నానం చేసి 11 గంటలకి పొయ్యి వెలిగించండి”
పట్టపగలు ట్యూబ్ లైట్ వేసుకొని అందరం హాలులో కూర్చున్నాం.
“పట్టిపగలు పనులన్నీ ఆపి లోపల కూర్చోవడం వరకు బానే ఉంది. కానీ మంచి నీటి తో పాటు తిండి తిప్పలు కూడా మానేయడం లో అర్థం ఏంటి మామ” ధైర్యం చేసి అడిగాను మామ గారిని.
అందుకు ఆయన “ఆ కాలం లో పల్లెల్లో మరుగు దొడ్లు ఇంటి బయట ఉండేవి. ఆ సమయం లో ఏమైనా తిన్నా , తాగినా మరుగు దొడ్లు ఉపయోగించాల్సిన అవసరం వస్తుంది. వాటి కోసం ఇల్లొదిలి బయటకు పోవాల్సి వస్తుంది. ముఖ్యంగా గర్భిణులకు సూర్య గ్రహణం మరింత ప్రమాదకరం, అందుకే ఈ అలవాటు” అని సమాధానమిచ్చారు.
“ఆ కాలం లో సరే. మరి ఈ కాలంలో మరుగు దొడ్లు ఇంట్లో నే ఉన్నాయిగా. పైగా ఇక్కడ గర్భిణులు కూడా లేరు. తిండి నీరు ఆపడం అవసరమా” అని ఎదురు ప్రశ్న వేశాను.
“అనాది నుంచి పాటిస్తూ వచ్చాము. ఒక్క శాతం డౌట్ వున్నా, తెలిసి తెలిసి తప్పు చెయ్యడం ఎందుకు ” అని సమర్థించారు.
“చాలా చక్కగా వివరించారు మామ, రాబోవు తరానికి ఈ విజ్ఞానం ఎంతో ముఖ్యం” అన్నాను గోడపై వున్న గడియారం వైపు చూస్తూ.
*******
సమయం: మధ్యాహ్నం 1 గం.
సందర్భం: ఆఫీస్ లో దీపావళి లంచ్ పార్టీ
సహచరులు బఫెట్ భోజనం ప్లేట్లతో ఓ చోట గుమిగూడారు.
“భోజనం అదిరిందబ్బా. దీని కోసం దాదాపు అరగంట లైన్ లో నిలబడ్డాను ” ఆ గుంపులోని ఒకరు కామెంట్ చేశారు.
“మీరింకా నయం. నేనైతే ముప్పావు గంట వేచి ఉండాల్సి వచ్చింది” జవాబిచ్చాను.
“మీ టీం లో కొంత మందిని తీసేస్తున్నారంట కదా” టాపిక్ మార్చారు మరొకరు పక్క టీం లోని వ్యక్తి కేసి చూస్తూ.
“అవును, AI పేరు చెప్పి చాలా ఉద్యోగాలు తీసేస్తున్నారు. అందుకే ఏజెంటిక్ AI సర్టిఫికెట్ పూర్తి చేశాను.” గులాబ్ జామున్ తింటూ సమాధానమిచ్చాడు.
“అవును లింక్డ్‌ఇన్ లో నీ సర్టిఫికెట్ చూసాను. కంగ్రాట్స్. ఆ ఎగ్జామ్ పాస్ కావడం కష్టమా”
“చాలా. రాత్రింబవళ్ళు కష్టపడి చదివి రాశాను.”
“సరే, ఇంతకీ మీ రోల్ ఏంటి?” అని అడిగాను ఆ వ్యక్తి కేసి చూస్తూ.
“ముఖ్యంగా కస్టమర్ ఎంగేజ్మెంట్ అండీ. వాళ్ళని లంచ్ లకి తీసుకెళ్లడం. వాళ్ళు అంగీకరిస్తే, మా టీం కి కాంట్రాక్టులు వచ్చేలా చేసి, వాళ్ల వీసా ప్రాసెస్ చూడటం వంటివి.”
“మరి మీరు రాత్రింబవళ్లు కష్టపడి సంపాదించిన ఆ AI సర్టిఫికెట్ ఎక్కడ ఉపయోగపడుతుంది?” క్యూరియాసిటీ ఆపలేక అడిగాను.
“ఆ కస్టమర్ ఎంగేజ్మెంట్ లో, వాళ్లకు చెప్పుకోవడానికే నండి. వేరే ఉపయోగమేమి లేదు” వెంటనే సమాధానం ఇచ్చాడు.
*******
సమయం: రాత్రి 10.30 గం.
సందర్భం: ‘ఓజీ’ ట్రైలర్ విడుదలయ్యే రోజు
బెడ్ మీద దుప్పటి కప్పుకొని ఫోన్ చూడడంలో ఉన్న సుఖం వేరే దేనిలో లేదు.
అది ‘ఓజీ’ చిత్రం ట్రైలర్ విడుదల రోజు. ఉదయం 10:30 గంటలకు వస్తుందన్న ట్రైలర్, రాత్రి 10:30 అయినా రాలేదు. ఒకపక్క యూట్యూబ్, మరోపక్క X (మునుపటి ట్విట్టర్) మార్చి మార్చి చూస్తున్నాను.
మధ్యలో, యూట్యూబ్‌లో వచ్చే షార్ట్స్ కనువిందు చేస్తున్నాయి:
‘మోనికా’ డాన్స్ ను ఒక ఆంగ్ల వృద్ధుడు అదరగొడుతున్నాడు.
మరోపక్క, ‘కుర్చీ మడత పెట్టి’ పాట డాన్స్ ను ఒక జపనీస్ నృత్య బృందం ఇరగదీస్తోంది.
మరో వీడియోలో, ఒక ఫ్యాన్ సెల్ఫీ కోసం ఎగబడగా… ఆ ఫోన్‌ను లాక్కొని పగుల కొట్టాడు ఓ ప్రముఖ సినిమా స్టార్.
ఆ వీడియో అవగానే , ఈజీగా చేసుకోదగిన చికెన్ బిర్యానీ పద్దతి.
ఇలా ఒక దాని తరువాత మరొకటి అపరిమిత వినోదాన్ని పంచుతున్నాయి.
ఈ వీడియోల మధ్య ఒక పేరు మోసిన డాక్టర్ ఆరోగ్యం కోసం చెప్పిన టిప్స్: “రాత్రి పడుకోనే గంట ముందు అన్ని రకాల స్క్రీన్లు చూడడం ఆపేయండి. మంచి నిద్ర రావాలంటే టీవీలు, ఫోన్లు చూడకండి. ముఖ్యంగా చిన్న పిల్లలకు చిన్నప్పటి నుండే ఈ పరిమితులు పెట్టి మంచి అలవాట్లను నేర్పండి.”
ఆ డాక్టర్ వీడియో చూడగానే, పక్కనే పడుకున్న మా చిన్నోడి వైపు కంగారుగా చూశాను. వాడు సీలింగ్ ఫ్యాన్‌కేసి చూస్తూ, ఏదో ఆలోచిస్తూ, సగం నిద్రావస్థలో కనిపించాడు. వాడి చేతిలో ఫోన్ లేదని తెలిసి, సంతృప్తిగా యూట్యూబ్ వైపు మళ్ళీ చూశాను.
*******
పరిశీలన
చిన్నప్పుడు బానే ఉండేది. పెద్దవాళ్ళు ఏది చెబితే అది వినే వాళ్ళం. ఇప్పుడు పెద్దయ్యాం. ఙ్ఞానం వచ్చింది. మన కొంప ముంచింది. అది అన్నింటిని ప్రశ్నించడం మొదలు పెట్టింది. భగవంతుని వ్రతం చేసుకుందామనుకుంటే “ఆ వ్రత కథలో నిరుపేద బ్రాహ్మణుడు వ్రతం చేయగానే అంత సులువుగా ధనవంతుడు ఎలా అయ్యాడు?” అని ప్రశ్నించింది.
“ఆడవారు మాసం లోని ఆ ఐదు రోజులు ఎందుకు పూజలు చేయకూడదు?. వారి ఓపిక, వారి ఇష్టం. సమస్త జీవ రాశులతో పాటు ప్రపంచాన్ని సృష్టించిన ఆ బ్రహ్మాండ నాయకుడికి ఇది మంచి, ఇది మలినం అని ఉంటుందా?.”
“నువ్వు చేస్తున్న ఉద్యోగానికి సంతృప్తి, పురోగతులు ఉన్నాయా?”
ఇలాంటి ప్రశ్నలెన్నో. ఈ ప్రశ్నలన్నింటికీ నాకు మాయాబజార్ సినిమా చూస్తున్నప్పుడు సమాధానం దొరికింది. ఘటోత్కచుని సేన లోని రమణా రెడ్డి జట్టు వియ్యాల వారు కౌరవ సేనలోని శర్మ, శాస్త్రి లైన అల్లు రామలింగయ్య జట్టును ఆట పట్టిందాం అనుకుంటుంది. మాయమైన వియ్యాల వారి విందు ప్రత్యక్ష మవుతుంది. కంబళిపై కూర్చొని సేద తీరుతున్న వారిపై ఆ కంబళి దాడి చేస్తుంది. ఇవన్నీ తట్టోలేక శాస్త్రి శర్మను ఇదంతా కనికట్టా? ఇంద్రజాలమా? అని అడుగుతాడు. అదేమీ కాదు ఇదంతా మన “మనః భ్రాంతి” అని ఎదో సమాధాన పరచాలని చెప్తాడు. అవును ఈ జీవన విధానమే మన మనో బ్రాంతి.
ఇక ఈ ఫిలాసఫీ ప్రబోధం చాలు. మనసు మారే లోపు ఈ బ్లాగు ను నా వెబ్సైట్ లో పబ్లిష్ చేయ దలిచాను. పబ్లిష్ చేయడానికి ఇది మంచి సమయమా కాదా అని రాహుకాలం గంటల కోసం గూగుల్ లో వెతుక ఆరంభించాను . అప్పటి వరకు చాటున ఉన్న నా ఙ్ఞానం “నువ్వు చెప్పేదేంటి చేసేదేంటి?” అని కోపంగా నా వంక చూసింది. అందుకు నేను “నే సమాధానం చెప్పలేని ప్రశ్నలు అడిగే నీ ఙ్ఞానం నాకు అక్కర్లే” అని కసురుకున్నాను.
ఆలోచనలో పరిపక్వత, ఆచరణలో స్పష్టత అద్భుతం… ఇలాంటివి మీరు ఇంకా చేయాలని నా మనవి గౌతమ్ గారు ❤️
LikeLiked by 1 person